ఓటు వేసిన ప్రజలు తిరగబడితే గోడలు కూడా కూలిపోతాయి
కలం తో మార్పు : తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా
ఉదయం 8 గంటలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బయట అప్పటికే పెద్ద లైన్ కనిపించింది. ఒక రైతు చేతిలో పంట నష్టపోయిన ఫోటోలు, ఒక వృద్ధురాలి చేతిలో పెన్షన్ అప్లికేషన్, ఒక యువకుడి చేతిలో ఉద్యోగ సమస్యల పత్రాలు, మరొకరి చేతిలో కాలనీ మురుగునీటి ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫైల్ ఉంది. కానీ ప్రతి ఫైల్ వెనుక ఒక బాధ ఉంది.
ఆ లైన్లో నిలబడ్డాడు రవి.
తన కాలనీలో పగిలిపోయిన రోడ్లు, పేరుకుపోయిన చెత్త, దుర్వాసనతో నిండిన డ్రైనేజ్, జబ్బులతో బాధపడుతున్న పిల్లలను చూసి ఇక మౌనం ప్రమాదమని భావించాడు. అందుకే ప్రజల సంతకాలు తీసుకున్నాడు. ఫోటోలు సేకరించాడు. మున్సిపాలిటీకి ఇచ్చిన పాత ఫిర్యాదుల కాపీలు జత చేశాడు.
ఈసారి అయినా సమస్య వినిపిస్తుంది అనుకున్నాడు.
కానీ అక్కడ అతనికి ఎదురైన మొదటి ప్రశ్న సమస్య గురించి కాదు.
“ఎవరితో వచ్చావు?”
రవి ఆశ్చర్యపోయాడు.
“సార్… సమస్య చెప్పడానికి వచ్చాను” అన్నాడు.
మళ్లీ ప్రశ్న వచ్చింది.
“మీ ఏరియా లీడర్ ఎవరు?”
“ఎవరూ రాలేదు సార్” అన్నాడు.
అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి నవ్వుతూ అన్నాడు.
“ఇక్కడ పని జరగాలంటే లీడర్లు ఉండాలి బాబు.”
ఆ మాట రవి గుండెల్లో బలంగా తాకింది.
అతని మనసులో ఒక్కసారిగా ప్రశ్నలు మొదలయ్యాయి.
ఓటు వేసింది ప్రజలే కానీ ప్రజల మాటకు మధ్యవర్తులు ఎందుకు?
ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చారు.
“అన్నా ఓటు వేయండి… మీ సమస్య మా బాధ్యత” అన్నారు.
అప్పుడు మధ్యలో ఎలాంటి లీడర్లు అవసరం లేదు.
అయితే ఇప్పుడు ప్రజలు తమ సమస్య చెప్పుకోవాలంటే మధ్యలో గోడలు ఎందుకు?
కొద్దిసేపటికి ఎమ్మెల్యే గారి కారు వచ్చింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లబట్టల వాళ్లు ముందుకు పరుగులు తీశారు. పీఏలు చుట్టుముట్టారు. గన్‌మెన్లు ప్రజలను వెనక్కి నెట్టారు.
అక్కడ రవికి ఒక చేదు నిజం అర్థమైంది.
ప్రజాస్వామ్యంలో ఓటరు రాజు అంటారు. అయితే సమస్య చెప్పడానికి అనుమతి ఎందుకు?
ఓటు వేయడానికి అనుమతి అవసరం లేదు. కానీ సమస్య చెప్పడానికి మాత్రం పీఏ, గన్‌మెన్, లోకల్ లీడర్… ఇన్ని గోడలు.
చివరకు రవికి లోపలికి వెళ్లే అవకాశం వచ్చింది.
అతను ఫైల్ ముందుకు పెట్టాడు.
“సార్… మా కాలనీలో పిల్లలు కూడా బయటికి రావలేని పరిస్థితి ఉంది” అన్నాడు.
కానీ ఎమ్మెల్యే గారు ఫైల్ కూడా సరిగా చూడలేదు. పక్కనే ఉన్న పీఏ చేతికి ఇస్తూ ఒక మాట చెప్పారు.
“మీతో లోకల్ లీడర్లు రావాలి.”
ఆ క్షణంలో రవి లోపల ఏదో విరిగిపోయింది.
ఎన్నికలప్పుడు ప్రజలే దేవుళ్లు. గెలిచాక లీడర్ల సిఫార్సులే దేవుళ్లా?
అతని కళ్ల ముందు ఎన్నికల రోజులు తిరిగాయి. అప్పుడు నాయకులు చేతులు జోడించారు. ఇంటింటికీ తిరిగారు. “మీ ఓటు మా భవిష్యత్తు” అన్నారు.
కానీ ఇప్పుడు ఒక సమస్య చెప్పడానికి కూడా సిఫార్సు అవసరమా?
బయటకు వచ్చిన రవి చుట్టూ చూసాడు. అక్కడ చాలామంది ప్రజలు అలాగే నిలబడి ఉన్నారు.
ఒక వృద్ధుడు మెల్లగా అన్నాడు.
“బిడ్డా… ఇక్కడ సమస్యల కంటే సిఫార్సులకు విలువ ఎక్కువ.”
ఆ మాట విన్న రవి ఒక్కసారిగా ఆగిపోయాడు.
ఓటు కోసం నేరుగా వచ్చేవారు… సమస్యలప్పుడు మధ్యలో గోడలు ఎందుకు?
ఓటు వేయడానికి ఒక్కడినే సరిపోతే… సమస్య చెప్పడానికి గుంపు ఎందుకు?
సామాన్యుడి సమస్యకు విలువ లేదా… సిఫార్సు ఉన్న ఫైలుకే విలువా?
ఈ ప్రశ్నలు అతని మనసులో తుఫాన్‌లా తిరిగాయి.
ఆ రోజు రవి ఇంటికి వెళ్లలేదు. కాలనీలోని ప్రజలందరినీ ఒకచోట చేర్చాడు.
అతను ఒక్క మాట అన్నాడు.
“మన సమస్య మనమే మాట్లాడుకోకపోతే… మన కోసం ఎవరూ మాట్లాడరు.”
అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
కొద్దిసేపటి తర్వాత ఒక మహిళ లేచి అంది.
“మనం మౌనంగా ఉన్నంతవరకే వాళ్లు బలంగా ఉంటారు.”
ఆ మాటతో కాలనీలో మార్పు మొదలైంది.
ప్రజలు కలిసి నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి సమస్యను వీడియో తీయాలి. సోషల్ మీడియాలో పెట్టాలి. ఆర్‌టీఐ వేయాలి. మీడియాను పిలవాలి. అందరం కలిసి కార్యాలయాలకు వెళ్లాలి.
“ఒక్కొక్కరిగా ఉన్న ప్రజలను నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ ప్రజల గొంతును ఎప్పటికీ అణచలేరు.”
అని నిర్ణయించుకున్నారు.
కొన్ని రోజుల తర్వాత అధికారులు కాలనీలోకి వచ్చారు. రోడ్లు కొలిచారు. డ్రైనేజ్ పనులు మొదలయ్యాయి. చెత్త వాహనం రావడం ప్రారంభమైంది.
అప్పుడు రవి మెల్లగా నవ్వాడు.
ఎందుకంటే అతనికి ఒక నిజం అర్థమైంది.
ప్రజలు ప్రశ్నించడం మొదలెడితే వ్యవస్థ వణకాల్సిందే.
సామాన్యుడి గొంతు అణిచేస్తే ఒకరోజు అదే తుఫాన్ అవుతుంది.
ప్రజలు భయపడడం ఆపితే మధ్యవర్తుల రాజ్యం ముగుస్తుంది.
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే బలం.
అదే బలం ఒక్కరోజు తిరగబడితే…
గోడలు మాత్రమే కాదు… కుర్చీలు కూడా కూలిపోతాయి.

No comments:
Post a Comment