
సౌండ్ వార్ – ట్రైన్‌లో ఒక చిన్న సంఘటన
రాత్రంతా ప్రయాణం చేసి, కాస్త ప్రశాంతంగా నిద్రపోదామనుకున్నాను. కానీ నా కింద బెర్త్‌లో ఉన్న ఒక ప్రయాణికుడు తన మొబైల్‌లో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఇబ్బంది పడుతున్నా, అతనికి మాత్రం తన సంగీత ప్రపంచమే ముఖ్యమైనట్లు కనిపించింది.
మొదట నేను చాలా మర్యాదగా,
"డియర్, ఇయర్‌ఫోన్స్ ఉంటే వాడండి. మీ పాటలు మీకే స్పష్టంగా వినిపిస్తాయి, మాకూ ప్రశాంతంగా ఉంటుంది."
అని చెప్పాను.
అతను కొంచెం సౌండ్ తగ్గించాడు. కానీ పాటలు మాత్రం ఆగలేదు. నా చెవికిందే స్పీకర్ పెట్టినట్టుగా వినిపిస్తూనే ఉన్నాయి. కాసేపు ఓపిక పట్టాను. చివరకు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది.
నేను నా మొబైల్ తీసి, నాకు ఇష్టమైన అన్నమయ్య కీర్తనలు కొంచెం గట్టిగానే ప్లే చేశాను.
ఒక్కసారిగా బోగీలో రెండు రకాల సంగీతాలు వినిపించాయి. ఒకవైపు అతని పాటలు... మరోవైపు నా అన్నమయ్య కీర్తనలు!
కొద్ది క్షణాలు గడిచాక ఆ ప్రయాణికుడు నా వైపు చూసి ఆశ్చర్యపోయాడు. తన పాటలు వింటున్న ఆనందం, ఇతరులకు కూడా అలాగే ఉంటుందని అప్పుడే గుర్తొచ్చిందేమో!
కొద్దిసేపటికి లేచి టాయిలెట్ వైపు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చాక తన మొబైల్ సౌండ్ పూర్తిగా తగ్గించాడు.
బోగీలో మళ్లీ ప్రశాంతత నెలకొంది.
అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది...
ప్రజా ప్రదేశాల్లో మనకు నచ్చినది వినే హక్కు ఎంత ఉంటుందో, పక్కవాళ్ల ప్రశాంతతను గౌరవించే బాధ్యత కూడా అంతే ఉంటుంది.
భక్తి పాటలైనా, సినిమా పాటలైనా, ప్రసంగాలైనా... అవి మనకు ఆనందం ఇవ్వొచ్చు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.
నీతి
"ఇయర్‌ఫోన్స్ అనే చిన్న సాధనం, పెద్ద గొడవలను ఆపగలదు."
✍️ తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా
కవి • కథారచయిత • వ్యాసకర్త
No comments:
Post a Comment