Translate

Thursday, July 2, 2026

అడకత్తెరలో అన్నదాత..!!


అడకత్తెరలో అన్నదాత..!!

ప్రభుత్వం రైతుబంధు....
ఎకరానికి 10000 ఇస్తుంది.
విత్తనానికి సాయం చేస్తుంది.
కానీ....!!...??
ఆ డబ్బు బ్యాంకులో పడేలోపే
అప్పులవాడు ఇంటి ముందు నిలబడతాడు.
ఎరువుల షాపువాడు లెక్క రాస్తాడు.
రైతుబంధు...
అప్పుల బంధం అవుతుంది.

వరుణుడు వర్షం కురిపించడు...
మబ్బులు కమ్ముతాయి.
ఉరుములు ఉరుముతాయి.
ఊరిస్తాయి... ఊరడిస్తాయి.
కానీ...
ఒక్క చినుకు కూడా రాల్చవు.

భూమిలోనే...
విత్తనం మాడిపోతుంది.
ఆశలు ఎండిన నేలలా
బీటలు వారుతాయి.
వరుణుడు...
బంధువు కాదు,
శత్రువుగా మారుతున్నాడు.

ప్రకృతిని నమ్ముకున్న రైతు...
ఆకాశం వైపు చూస్తాడు.
భూమిని నమ్ముతాడు.
చెమట చిందించి...
నెత్తురు ధారపోసి...
పంట పండిస్తాడు.
దేశానికి అన్నం పెడతాడు.

రైతు పరిస్థితి...
అడకత్తెరలో చిక్కుకున్నట్టే...!!

ఒకవైపు ప్రభుత్వం
ఇచ్చే సాయం చాలదు.
మరోవైపు వరుణుడు
కరుణ చూపడు.
ఇంకోవైపు దళారులు
దోచుకుంటారు.
అప్పులు...
మెడకు ఉరిగా మారుతాయి.

రైతు...
అడకత్తెరలో పోకచెక్కలా
నలిగిపోతున్నాడు.
నుజ్జునుజ్జు అవుతున్నాడు.
కన్నీళ్లు కారుస్తూ...
కడుపు మాడ్చుకుంటూ...
ఉరితాడు వైపు చూస్తున్నాడు.

ఓ ప్రభుత్వమా...!!
రైతుబంధు చాలు...
రైతుకు భరోసా ఇవ్వు.
డబ్బు కాదు...
గిట్టుబాటు ధర ఇవ్వు.
రుణమాఫీ కాదు...
పంటకు బీమా ఇవ్వు.
అన్నదాత
ఆత్మహత్య చేసుకోకుండా చూడు.

ఓ వరుణదేవా...!!
ఒక్కసారి కురిసి చూడు.
భూమాత పులకించిపోతుంది.
రైతన్న ముఖంలో
చిరునవ్వు విరుస్తుంది.
దేశం సుభిక్షంగా ఉంటుంది.

ఓ సమాజమా...!!
కళ్లుతెరువు.
నువ్వు తినే ప్రతి మెతుకు వెనుక
ఒక రైతు బతుకు ఉంటుంది.
రైతన్నను గౌరవించు.
వాడి కష్టాన్ని గుర్తించు.
వాడి కన్నీరు తుడువు.

ఓ రైతన్నా...!!
అధైర్యపడకు.
నీవు ఒంటరివాడివి కాదు.
నీ చెమట భూమాతకు తెలుసు.
నీ కష్టం దేశానికి తెలుసు.
ఆత్మహత్య పరిష్కారం కాదు...
పోరాటమే పరిష్కారం...!!

రైతుబంధు...
కాగితం మీద...
వర్షం బంధు...
ఆకాశం మీద...
రైతు బతుకు మాత్రం...
ఉరితాడు మీద...

అడకత్తెరను విరిచేయాలి...!
అన్యాయాన్ని నరికే ధర్మపు కొడవలి పట్టాలి...!
అన్నదాతను కాపాడాలి...!!
అదే నిజమైన లోకకల్యాణం...!!

"రైతు బతికితేనే... దేశం బతుకుతుంది.
అన్నదాత నవ్వితేనే... అన్నపూర్ణ చిరునవ్వుతుంది."
🌾🙏

– "కావ్యసుధ"
"వాజ్ఞ్మయ భూషణ"
"సాహితీ శిరోమణి"
భాగ్యనగరం

No comments:

Post a Comment

అడకత్తెరలో అన్నదాత..!!

అడకత్తెరలో అన్నదాత..!! ప్రభుత్వం రైతుబంధు.... ఎకరానికి 10000 ఇస్తుంది. విత్తనానికి సాయం చేస్తుంది. కానీ....!!...?? ఆ డబ్బు బ్యాంకులో పడేలోపే...